Chandrababu: దేవినేని సీతారామయ్య మృతిపై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, లోకేశ్
- అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత
- హెరిటేజ్ ఫుడ్స్ చైర్మన్ గా వ్యవహరించిన సీతారామయ్య
- ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు, లోకేశ్
హెరిటేజ్ ఫుడ్స్ మాజీ చైర్మన్, ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కంపెనీ పార్ట్ నర్ దేవినేని సీతారామయ్య (96) మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఎన్టీరామారావు గారికి దేవినేని సీతారామయ్య అత్యంత సన్నిహితుడని, తనకు మార్గదర్శి అని పేర్కొన్నారు. ఇప్పుడాయన మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఆయనతో సంభాషించిన మధురక్షణాలు ఉన్నాయని, ఆయనతో మాట్లాడడం ద్వారా నేర్చుకున్న అనేక పాఠాలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని వివరించారు. నారా కుటుంబం ఆయనను మిస్ అవుతోందని ట్వీట్ చేశారు.
అటు, నారా లోకేశ్ స్పందిస్తూ, దేవినేని సీతారామయ్య మృతి పట్ల తీవ్రంగా చలించిపోయానని వెల్లడించారు. ఆయనను తాను తొలి గురువు అని చెబుతానని, తనకు అన్ని విషయాల్లో దిక్సూచిలా వ్యవహరించారని స్మరించుకున్నారు. తనపై దేవినేని సీతారామయ్య ప్రభావం అపారంగా ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగా నేను ఎంతో మెరుగయ్యానంటే అందుకు కారణం ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలే అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఓ ఆప్తుడ్ని కోల్పోయానంటూ బాధను వెలిబుచ్చారు.