Theaters: చైనాలో సాధారణ పరిస్థితులు... సినిమా థియేటర్లకు మోక్షం
- చైనాలో తెరుచుకున్న సినిమా హాళ్లు
- భౌతికదూరం నిబంధనతో సినిమా ప్రదర్శనలు
- థర్మల్ స్కానర్ తో పరీక్షించాకే లోపలికి ప్రవేశం
కరోనా వైరస్ రాకతో ప్రపంచం మొత్తం మారిపోయింది. ఎక్కడ చూసినా లాక్ డౌన్లు, కర్ఫ్యూలు, కంటైన్మెంట్ జోన్లు, భౌతికదూరం నిబంధనలు, మాస్కులు, శానిటైజర్లు, వ్యాక్సిన్ గురించే చర్చ! అనేక దేశాల్లో కరోనా సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. నిత్యం వేల సంఖ్యలో కేసులు, భారీగా మరణాలతో అగ్రదేశాలు సైతం అల్లాడిపోతున్నాయి.
అయితే, ఈ రాకాసి వైరస్ కు జన్మస్థానంగా అప్రదిష్ఠ మూటగట్టుకున్న చైనాలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సినిమా థియేటర్లు కూడా తెరుచుకుంటున్నాయి. హాంగ్ జోవ్ అనే ప్రాంతంలో ఓ సినిమా థియేటర్ లో ప్రేక్షకులు భౌతికదూరం పాటిస్తూ సినిమా చూస్తున్నప్పటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
హాంగ్ జోవ్ లోనే కాకుండా, షాంఘై, గుయిలిన్ వంటి ప్రాంతాల్లోనూ థియేటర్లకు మోక్షం కలిగింది. అయితే, మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు. థియేటర్ లోపల సీట్ల మధ్య ఖాళీ ఉంచుతున్నారు. వాటిలో ఎవరూ కూర్చోకుండా టెడ్డీ బేర్ వంటి బొమ్మలు ఉంచుతున్నారు. షో ముగిసిన తర్వాత కచ్చితంగా శానిటైజ్ చేస్తున్నారు. థియేటర్ లోపలికి అడుగుపెట్టే సమయంలోనే థర్మల్ స్కానర్ తో ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తున్నారు. ఏదేమైనా ఈ పరిణామం ఇతర దేశాల్లోనూ ఆశలు కలిగిస్తోంది. భారత్ లోనూ కేసుల సంఖ్య అదుపులోకి వస్తే థియేటర్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.