Yanamala: రాష్ట్రపతి సంతకం లేకుండా రాజధానిని మార్చలేరు.. ప్రభుత్వ సలహాదారులు ముందు అధ్యయనం చేయాలి: యనమల

Without Presidents signature you cant change capital says Yanamala

  • రాష్ట్రపతి సంతకంతోనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చింది
  • అమరావతి ప్రాంతాన్ని కేంద్ర కమిటీ సూచించింది
  • రాజధాని బిల్లు గవర్నర్ వద్దకు పంపడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది

రాష్ట్రపతి సంతకంతోనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అమరావతికి రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారా? అంటూ వైసీపీ నేతలు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. రాష్ట్రపతి చేసిన చట్టం, కేంద్ర కమిటీ ద్వారానే అమరావతి రాష్ట్ర రాజధానిగా అవతరించిందని తెలిపారు. ఇప్పుడు రాజధానిని మార్చాలంటే మళ్లీ రాష్ట్రపతి సంతకం తప్పని సరి అని చెప్పారు.

కేంద్రం చేసిన చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్రం సొంతంగా చట్టం చేయాలనుకుంటే దానికి రాష్ట్రపతి సంతకం తప్పనిసరి అని యనమల చెప్పారు. ఏపీ రాజధాని గుర్తింపుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించిందని... ఆ కమిటీ అమరావతి ప్రాంతాన్ని సూచించిందని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో అమరావతి రాజధానిగా ఏర్పాటయిందని చెప్పారు.

ఇప్పుడు రాజధానిని మార్చాలంటే రాష్ట్రపతి సంతకం అవసరమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ సలహాదారులు ఈ విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. కేంద్ర చట్టాలను పూర్తిగా అధ్యయనం చేయాలని... ఆ తర్వాతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 5(2), సబ్ సెక్షన్ 94(3), సెక్షన్ 94(4)లో రాజధాని గురించి, మౌలిక వసతుల గురించి స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.  

రాజధాని అంశం శాసనమండలి సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉందని... ఇదే విషయాన్ని హైకోర్టుకు వైసీపీ ప్రభుత్వం తెలిపిందని యనమల గుర్తు చేశారు. సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వమే ఒప్పుకుని... ఇప్పుడు గవర్నర్ వద్దకు వాటిని పంపడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పారు. రాష్ట్రపతిని, కేంద్ర ప్రభుత్వాన్ని తోసిరాజని మొండిగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దుందుడుకు చర్యలకు ఇకనైనా ముగింపు పలకాలని... రాష్ట్రపతిని, న్యాయస్థానాలను, కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవించడం ప్రభుత్వాల ధర్మమని చెప్పారు.

  • Loading...

More Telugu News