Telangana: యుద్ధ జోన్‌లోకి కూడా మీడియాను అనుమతిస్తున్నారు కదా?: తెలంగాణ సచివాలయ కూల్చివేత కవరేజీకి అనుమతి నిరాకరణపై హైకోర్టు

high court on telangana secratatiat demolition

  • మీడియాకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్
  • పిటిషన్‌ దాఖలు చేసిన 'వీ6' న్యూస్‌ ఛానెల్, 'వెలుగు' పత్రిక  
  • ప్రతిరోజు బులెటిన్‌లో వివరాలు చెప్పొచ్చు కదా? అని కోర్టు ప్రశ్నలు

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత పనులు కొనసాగుతుంటే భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చివరకు మీడియా కవరేజ్‌కి అనుమతి ఇవ్వట్లేదని, మీడియాకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని తెలుగు న్యూస్‌ ఛానెల్ వీ6, వార్తా పత్రిక 'వెలుగు' హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు కొనసాగాయి.

పత్రికా స్వేచ్ఛను హరించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. దీనికి కోర్టు స్పందిస్తూ, కూల్చివేతల సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అయితే, కవరేజీ సమయంలో ఇంజనీర్ల సూచనల ప్రకారమే నడుచుకుంటామని పిటిషనర్ తెలిపారు. అయితే, మీడియాను అనుమతిస్తే సాధారణ ప్రజలు కూడా తమకు అనుమతివ్వాలని అడుగుతారని ఏజీ వాదించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు సమాచారం ఇచ్చే బాధ్యత మీడియాకు ఉంది కదా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. యుద్ధ జోన్‌లోకి కూడా మీడియాను అనుమతిస్తున్నారు కదా? అని గుర్తు చేసింది. నిషేధిత ప్రాంతాలు మినహా మీడియాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుందని హైకోర్టు తెలిపింది. ప్రతిరోజు కూల్చివేత వివరాలపై బులిటెన్ ఇచ్చినా సరిపోతుంది కదా? అని ప్రశ్నించింది. ఈ విషయంపై ప్రభుత్వాన్ని అడిగి చెబుతామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News