Uddhav Thackeray: నేను డొనాల్డ్ ట్రంప్ ను కాను.. ప్రజలు ఇబ్బంది పడటాన్ని చూడలేను: 'మహా' సీఎం ఉద్ధవ్ థాకరే
- నా ప్రజల ఇబ్బందులను నేను చూడలేను
- రాష్ట్రంలో ఇప్పటికీ లాక్ డౌన్ అమల్లో ఉంది
- విద్యార్థుల ఆరోగ్యమే మాకు ముఖ్యం
మహారాష్ట్రను కబళిస్తున్న కరోనా మహమ్మారిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను డొనాల్డ్ ట్రంప్ కాదు. నా కళ్ల ముందే నా ప్రజలు ఇబ్బంది పడటాన్ని నేను చూడలేను' అని అన్నారు. శివసేన అధికార మీడియా 'సామ్నా'కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ఈ వారాంతంలో రెండు భాగాలుగా ప్రసారం కానుంది. ఈ ఇంటర్వ్యూలోనే ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వదేశంలోనే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. వైరస్ ను కట్టడి చేయడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనే విమర్శలు ఉన్నాయి. తాను ట్రంప్ మాదిరి విఫలం చెందలేదనే విషయాన్ని ఉద్ధవ్ ఇంటర్వ్యూలో చెప్పారు. లాక్ డౌన్ ఇప్పటికీ అమల్లో ఉందని... అయితే ఒక్కొక్క దానికి క్రమంగా కరోనా నిబంధనల నుంచి సడలింపులు ఇస్తున్నామని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు ఎలాంటి పరీక్షలను నిర్వహించలేమని చెప్పారు. ఏ విద్యార్థి కూడా కరోనా బారిన పడకూడదని తెలిపారు. ఈ ఇంటర్వ్యూని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ చేశారు.