Pafiravir: కరోనాకు మరో చౌక ఔషధం... టాబ్లెట్ రూ. 59 మాత్రమే!
- బ్రింటన్ సంస్థకు డీసీజీఐ అనుమతి
- ఫావిటన్ పేరిట 200 ఎంజీ టాబ్లెట్లు
- పాఫిరావిర్ కు జనరిక్ గా ఫావిటన్
కరోనా వైరస్ సోకిన వారు స్వస్థత పొందేందుకు వీలుగా మరో చౌక ఔషధం అందుబాటులోకి వచ్చింది. పుణెకు చెందిన బ్రింటన్ ఫార్మా సంస్థకు పాఫిరావిర్ విక్రయాలకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి లభించగా, 'ఫావిటన్' (పాఫిరావిర్ జనరిక్) పేరిట 200 ఎంజీ టాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో టాబ్లెట్ ధర రూ. 59గా నిర్ణయించామని పేర్కొంది.
కాగా,ఇండియాలో ఫాబిఫ్లూ టాబ్లెట్ ధర రూ.75 కాగా, దానికన్నా చవకగా ఫావిటన్ టాబ్లెట్ లభించడం గమనార్హం. ఇక పాఫిరావిర్ ఔషధం కరోనా సోకి తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలుంటే సమర్థవంతమైన ఫలితాలను ఇస్తోందని వెల్లడైన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని కోవిడ్ కేంద్రాల్లోనూ ఫావిటన్ ను అందుబాటులో ఉంచుతామని బ్రింటన్ ఫార్మా సీఎండీ రాహుల్ కుమార్ దర్దా తెలిపారు.