Nimmagadda Ramesh: అసలు ఏపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర వ్యాఖ్యలు
- నిమ్మగడ్డ కేసులో ప్రతి విషయం మాకు తెలుసు
- గవర్నర్ ఆదేశించేంత వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది?
- శుక్రవారం లోపు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి
ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలంటూ వైసీపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ కేసు విషయంలో ప్రతి విషయం తమకు తెలుసని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని... అందుకే స్టే ఇవ్వడం లేదని తెలిపారు.
నిమ్మగడ్డకు పోస్టింగ్ ఇవ్వాలంటూ గవర్నర్ లేఖ పంపినా పాటించకపోవడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గవర్నర్ ఆదేశించేంత వరకు పరిస్థితి ఎందుకు వచ్చిందని అడిగారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ఆయన ప్రశ్నించడం గమనార్హం. వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.