KTR: హైదరాబాద్‌లో 'మహీంద్రా' వర్సిటీ ప్రారంభం.. ప్రసంగించిన కేటీఆర్, ఆనంద్ మహీంద్ర
- మహీంద్ర గ్రూప్‌కి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
- అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతుందన్న మంత్రి
- ఆవిష్కరణలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని వినతి
- ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఇదే మంచి అవకాశమన్న మహీంద్రా
హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ మండలం బహదూర్‌పల్లిలో ఈ రోజు 'మహీంద్రా' విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఆన్‌లైన్ వేదికగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. వర్చువల్ పద్ధతిలో ఆనంద్ మహీంద్రతో కలిసి వర్సిటీ ప్రారంభోత్సవంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
ఈ విశ్వవిద్యాలయ రూపకల్పనలో ఆనంద్ మహీంద్ర పోషించిన పాత్రను కేటీఆర్ అభినందించారు. మహీంద్ర గ్రూప్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఈ వర్సిటీ ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
వర్సిటీలో ఆవిష్కరణలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు. విద్యా బోధన, సమావేశాలు వంటి అన్ని అంశాలపై వర్చువల్ విధానాలపై ఎంతగా ఆధారపడుతున్నామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అందించే పద్ధతులను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆనంద్ మహీంద్ర కంపెనీకి సంబంధించిన సంస్థలు తెలంగాణలో చాలా ఉన్నాయని ఆయన చెప్పారు.
ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఇదే మంచి అవకాశమని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఆన్‌లైన్ విద్యకు ఇటీవల ఆదరణ పెరిగిందని, విద్యార్థులకు ఉన్నతస్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తామని తెలిపారు. విదేశాల్లో చదువుకునే మన విద్యార్థుల కోసం తమ కంపెనీ 1950 నుంచే స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. దేశంలోని విద్యార్థులందరికీ కాలేజీ విద్యను దగ్గర చేయాలంటే కాలేజీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. మేకిన్ ఇండియాకు ప్రోత్సాహమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తమకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.
కాగా, బహదూర్‌పల్లిలో ఈ వర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ మేనేజ్‌మెంట్, మీడియా, డిజైనింగ్ వంటి అనేక కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలతో అందించనున్నారు. మహీంద్రా ఎకోలే సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ సైతం ఈ వర్సిటీ కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉంది.