Raghu Ramakrishna Raju: జగన్ గారూ.. ఇది రాచరిక వ్యవస్థ కాదు... సుప్రీంకోర్టు తీర్పును గౌరవించండి: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

Raghu Ramakrishna Raju advises Jagan to follow Supreme Court judgement

  • సుప్రీం తీర్పు మేరకు నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించండి
  • స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ రద్దు చేయడం మంచి నిర్ణయం
  • నాపై అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి వచ్చి వేడుకున్నారు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారంలోగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఎస్ఈసీగా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని కోరారు. కోర్టు తీర్పు మేరకు రమేశ్ ను నియమిస్తే తప్పేముందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరైనదని... కరోనా మహమ్మారి నుంచి ఆ నిర్ణయం ప్రజలను కాపాడిందని చెప్పారు.

కోర్టులకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రఘురాజు అన్నారు. మనది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య దేశమని... న్యాయ వ్యవస్థలను, కోర్టులను గౌరవిద్దామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడమే తన తప్పైపోయిందని అన్నారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం... రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి వచ్చి వేడుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా భారీ మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వం మనదని అన్నారు. పక్కనున్న వారి మాటలు విని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవద్దని సూచించారు. రాజ్యాంగం మీద అవగాహన లేని కొంతమంది చేసే ఫిర్యాదులతో తనకు ఏమీ కాదని చెప్పారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతును నొక్కే ప్రయత్నం చేయవద్దని అన్నారు.

  • Loading...

More Telugu News