Swaroopananda Saraswathi: పూజలు చేశాను, కరోనా పోతుందని చెప్పి.. పీఠానికి తాళం వేసుకున్నారు: స్వరూపానందస్వామిపై వాసుపల్లి విమర్శలు
- స్వరూపానంద కనిపించడం లేదు
- కరోనా పెరగడానికి మద్యం అమ్మకాలు కూడా కారణం
- మద్యం షాపులను మూసేయాలి
విశాఖ శారదాపీఠం స్వరూపానంద సరస్వతిపై టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శలు గుప్పించారు. కరోనాను అంతం చేయడానికి పూజలు చేశానని, మే 5వ తేదీ నాటికి కరోనా కథ ముగిసిపోతుందని స్వరూపానంద చెప్పారని... ఇప్పుడు పీఠానికి తాళం వేసుకున్నారని ఎద్దేవా చేశారు. స్వరూపానంద కనిపించడమే లేదని అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన విమర్శించారు. మద్యం దుకాణాలు తెరిచి, విచ్చలవిడిగా అమ్మకాలను జరపడం కరోనా వ్యాప్తికి కారణమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు మద్యం బాటిళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు.
కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల నష్ట పరిహారం అందించాలని ఈ సందర్భంగా వాసుపల్లి గణేశ్ డిమాండ్ చేశారు. మందు కోసం క్యూలైన్లలో నిలబడాల్సి రావడం దారుణమని అన్నారు. మందుబాబుల వల్ల కుటుంబసభ్యులు కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. ఇలాంటి సంక్షోభ సమయంలో మద్యం అమ్మకాలు అవసరమా? అని ప్రశ్నించారు. మద్యం షాపులను మూసేయాలని డిమాండ్ చేశారు.