Raghu Ramakrishna Raju: విజయమ్మ రాసిన పుస్తకాన్ని జగన్ చదవలేదు.. నా విషయంలో కూడా భంగపాటు తప్పదు: రఘురామకృష్ణరాజు

YSRCP has to respect courts says Raghu Ramakrishna Raju

  • న్యాయవ్యవస్థను గౌరవించాలని వైయస్ కూడా చెప్పారు
  • నిమ్మగడ్డ కులం రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చలేదు
  • జగన్ మాస్క్ వేసుకోవాలి
  • నాపై పనికిమాలిన వాళ్లు అనర్హత పిటిషన్ ఇచ్చారు
  • నన్ను దూషించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి గురించి వైయస్ విజయమ్మ రాసిన పుస్తకంలో కూడా న్యాయవ్యవస్థను గౌరవించాలని ఉందని చెప్పారు. ఆమె రాసిన బుక్ లో 75వ పేజీలో ఈ విషయం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు కానీ, చదవలేదని అన్నారు. న్యాయవ్యవస్థను గౌరవించాలని రాజశేఖరరెడ్డి కూడా చెప్పారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టైనా, తానైనా ఇదే విషయాన్ని చెపుతామని అన్నారు.

నిమ్మగడ్డ రమేశ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చాలా అపహాస్యం చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేశ్ కుమార్ కులం తమ ప్రభుత్వానికి నచ్చలేదని... కానీ, ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు.

కోర్టులను గౌరవించబోమనే విషయం వైసీపీ మేనిఫెస్టోలో లేదని రఘురాజు అన్నారు. ఇప్పటికే నిమ్మగడ్డకు చాలా అన్యాయం జరిగిందని... వెంటనే ఆయనను ఎస్ఈసీ పోస్టులో కూర్చోబెట్టాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరైందని ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. పారాసిటమాల్ వాడితే సరిపోతుందని జగన్ చెప్పారని, సహజీవనం చేయాలన్నారని, ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. కరోనాతో సహజీవనం చేస్తే రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఆరోగ్యశ్రీకే సరిపోతుందని అన్నారు. ఇకపై ఇలాంటి మాటలను పక్కనపెట్టి, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. జగన్ కూడా మాస్క్ వేసుకోవాలని... ఆయనను చూసి ప్రజలు నేర్చుకుంటారని అన్నారు.

తనపై ఎవరో పనికిమాలిన వాళ్లు అనర్హత పిటిషన్ ఇచ్చారని, దాన్ని వెనక్కి తీసుకోవాలని రఘురాజు డిమాండ్ చేశారు. అద్దె విమానం వేసుకుని ఢిల్లీకి వచ్చి పిటిషన్ ఇచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా తనకేం కాదని అన్నారు. నిమ్మగడ్డ విషయంలో మాదిరే... తన విషయంలో కూడా భంగపాటు తప్పదని చెప్పారు. మీ బొమ్మ పెట్టుకుని తాను గెలిచానని అంటున్నారని... అయితే మాత్రం, తప్పులను ప్రశ్నించవద్దా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను దూషించిన వారిపై ఇంత వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయస్థానాలంటే లెక్కలేని వారు... తనపై కేసులు ఎందుకు వేస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News