Donald Trump: పూర్తిగా ఆన్ లైన్ లో విద్యాబోధన ఎంచుకునే కొత్త విద్యార్థులకు అనుమతి లేదు: అమెరికా

Trump government orders no permission for full online education seekers

  • విదేశీ విద్యార్థుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా
  • ఆన్ లైన్ బోధనపై ఆంక్షలు
  • ఎలాగైనా విద్యాసంస్థలు తెరిపించాలన్నదే ట్రంప్ ఉద్దేశమని విమర్శలు

విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగులు, విదేశీ విద్యార్థుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ఆన్ లైన్ విధానంలో బోధన ఎంచుకుంటున్న కొత్త విద్యార్థులకు తమ దేశంలో ప్రవేశం లేదని తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాలో ఉంటూ ఆన్ లైన్ బోధన తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్న అమెరికా ఈ మేరకు మరో మెలిక పెట్టింది. ఈ నూతన విధానంపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ప్రకటన చేసింది.

అంతకుముందు, అమెరికాలో ఉంటూ ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థుల వీసాల రద్దు నిర్ణయంపై హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలే కాకుండా, 18 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ కూడా ఈ విద్యాసంస్థలకు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో, ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థుల వీసాల రద్దుపై వెనక్కి తగ్గింది. ఇప్పుడు కొత్త విద్యార్థులను అనుమతించేది లేదంటూ మరో నిబంధన తీసుకురావడం విమర్శలపాలవుతోంది. ఎలాగైనా విద్యాసంస్థలను తెరిపించాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News