Uttam Kumar Reddy: పరస్పర విరుద్ధ ప్రకటనలతో కేసీఆర్ సర్కారు ఎంత గందరగోళంలో ఉందో అర్థమవుతోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ నేతలు
- కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలమయ్యాడన్న ఉత్తమ్
- కరోనా వ్యాప్తికి టీఆర్ఎస్ సర్కారే కారణమంటూ ఆరోపణలు
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నిజాం గురించి గొప్ప మాటలు చెప్పే కేసీఆర్, నిజాం కట్టిన భవనాన్ని ఎందుకు కూల్చుతున్నట్టు అని ప్రశ్నించారు. కరోనా గురించి స్పందిస్తూ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుదలకు టీఆర్ఎస్ సర్కారే కారణమని ఆరోపించారు. ప్రజారోగ్యం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు.
ఇదే అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ కూడా చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. "ఆరోగ్యశాఖ అధికారులేమో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. మంత్రులేమో అబ్బెబ్బే, తూచ్ అదేం లేదంటారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో కేసీఆర్ ప్రభుత్వం ఎంత గందరగోళ పరిస్థితిలోఉందో అర్థమవుతోంది!" అంటూ వ్యాఖ్యానించారు.