Azam khan: రామాలయ భూమి పూజకు నన్ను ఆహ్వానించాల్సిందే.. లేకుంటే జలసమాధి: రామభక్తుడు ఆజంఖాన్
- వచ్చే నెల 5న రామాలయానికి భూమి పూజ
- ఆహ్వానించకుంటే సరయు నదిలో జలసమాధి అవుతానని హెచ్చరిక
- రాముడిని ఏ ఒక్క మతానికో, కులానికో ముడిపెట్టవద్దని హితవు
అయోధ్యలో నిర్మించనున్న రామాలయ భూమి పూజకు తనను కనుక ఆహ్వానించకుంటే జలసమాధి అవుతానని రామభక్తుడైన ముస్లిం ఆజంఖాన్ హెచ్చరించారు. ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరాం మందిర్ నిర్మాణ్ ముస్లిం కర్ సేవక్ మార్చ్ అధ్యక్షుడైన ఆజంఖాన్ మాట్లాడుతూ.. ఈ భూమి పూజ కార్యక్రమానికి తనను కనుక ఆహ్వానించకుంటే సరయు నదిలో జల సమాధి అవుతానని హెచ్చరించారు.
ఆజంఖాన్ అంటే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ కాదు. ఆయనకు ఈయనకు సంబంధం లేదు. ఈయన రామభక్తుడు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోరాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడిని ఏ ఒక్క మతానికో, కులానికో ముడిపెట్టడం సరికాదన్నారు. రామాలయ నిర్మాణానికి తాను సాక్ష్యం కావాలని, ధర్మబద్ధమైన పనికి తోడ్పడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
అయోధ్యలో ఉన్న ఆజంఖాన్ రామ్ లాలాను సందర్శించారు. అలాగే, రామ మందిర ఉద్యమానికి మార్గదర్శకుడైన దివంగత మహంత్ రామచంద్ర దాస్ పరమహంస సమాధి వద్ద నివాళులర్పించారు.