Alla Nani: వైద్యుల మనో ధైర్యాన్ని దెబ్బతీసే చర్యలు ఇవి: ఆళ్ల నాని
- కరోనా కేంద్రాలపై కొందరు ఆరోపణలు చేస్తున్నారు
- నెలకు కరోనా చికిత్సల కోసం రూ.300 కోట్లు
- కరోనా పరీక్షల కోసం 20 ల్యాబ్లను అందుబాటులో ఉంచాం
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోగులకు సరైన చికిత్స, సదుపాయాలు అందడం లేదంటూ వస్తోన్న ఆరోపణలను ఏపీ మంత్రి ఆళ్ల నాని కొట్టిపారేశారు. కరోనా కేంద్రాల్లో భోజనం, పారిశుద్ధ్యంపై ఆరోపణలు చేస్తున్నారని, ఇవి సరికాదని ఆయన చెప్పారు. రోగులకు చికిత్స చేస్తోన్న వైద్యుల మనో ధైర్యాన్ని దెబ్బతీసేలా ఇటువంటి ఆరోపణలు చేయకూడదని ఆయన హితవు పలికారు.
ఏపీలో కరోనా చికిత్సల కోసం నెలకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆళ్ల నాని తెలిపారు. కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. ఐఎంఐ వైద్యులు కూడా కరోనా చికిత్సలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలను అడ్డుకోవద్దని ప్రజలకు ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచామని ఆళ్ల నాని తెలిపారు. గత ఆరు నెలలుగా 17 వేల మంది నిపుణులను నియమించామని, కరోనా పరీక్షల కోసం 20 ల్యాబ్లను అందుబాటులో ఉంచామని ఆయన వివరించి చెప్పారు.