Avanthi Srinivas: విశాఖ రాజధానిగా వద్దని చెప్పడానికి రఘురామకృష్ణరాజు ఎవరు?: అవంతి

Avanthi Srinivas slams Raghurama Krishnaraju on capital issue

  • పార్టీ నచ్చకపోతే రాజీనామా చేయాలని సూచన
  • ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరిక
  • విధానాలు మార్చుకోకపోతే ఏపీ ప్రజలు క్షమించరని వ్యాఖ్యలు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. వైసీపీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అన్నారు. విశాఖ రాజధానిగా వద్దని చెప్పడానికి మీరెవరని మంత్రి ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికైనా విధానాలు మార్చుకోకపోతే ఏపీ ప్రజలు ఆయనని క్షమించరని అన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటిగడ్డ అని స్పష్టం చేశారు.

"విశాఖ ప్రజలు ప్రతిపక్ష నాయకుడ్నే విమానాశ్రయంలో అడ్డుకుని తిప్పి పంపారు. విశాఖను రాజధానిగా ఇస్తామని జగన్ చెప్పడంతో ఆయనపై నమ్మకంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు తమ పని తాము చేసుకుంటున్నారు తప్పితే, రాజధాని వద్దని వారు కోరుకోవడంలేదు. 'రాజు గారూ, మీరీ విషయం తెలుసుకోవాలి. మీకేమైనా అంతరాత్మ అనేది ఉందా? నలంద కిశోర్ అనే వ్యక్తి ఇక్కడ చనిపోతే మీరు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? నలంద కిశోర్ మా అందరికంటే మీకు బాగా సన్నిహితుడా?

జగన్ భిక్షతో సీటు తెచ్చుకుని, వైసీపీ గుర్తుపై గెలిచి ఇప్పుడు ప్రతిరోజూ, ప్రతి చిన్న విషయానికి జగన్ ను, పార్టీని విమర్శిస్తున్నారు. ఇది మీ స్థాయికి తగింది కాదు. ఇదెలా ఉందంటే... తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది. ఇవాళ జగన్ ఓ వ్యక్తి కాదు శక్తి. మీకు పార్టీ విధానాలు నచ్చకపోతే రాజీనామా చేయండి. పార్లమెంటు సభ్యుడిగా లేకపోతే బతకలేరా మీరు? ఇన్నాళ్లూ పార్లమెంటు సభ్యుడిగానే బతికారా?" అంటూ అవంతి నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News