Raghu Ramakrishna Raju: నన్ను క్షమించండి.. సిగ్గుతో తలదించుకుంటున్నా: రఘురామకృష్ణరాజు
- చెత్త బండిలో కరోనా బాధితుడిని తీసుకెళ్లడం దారుణం
- కరోనా కేసుల్లో ఏపీ తొలి స్థానానికి వెళ్తుంది
- కరోనాతో సహజీవనం చేయాలనే వ్యాఖ్యలను ఆపేయాలి
ముఖ్యమంత్రి జగన్ అట్టహాసంగా వెయ్యికి పైగా అంబులెన్సులను ప్రారంభించారని... కానీ అవి అవసరానికి ఉపయోగపడటం లేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన సొంతూళ్లో కరోనా బాధితుడుని చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో తీసుకెళ్లడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తన సొంత ఊర్లో ఈ ఘటన జరగడంతో సిగ్గుతో తల దించుకుంటున్నానని... ప్రజలు తనను క్షమించాలని అన్నారు. అంబులెన్సులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి మీడియా తీసుకెళ్లాలని విన్నవించారు.
రాష్ట్రంలో కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తో చర్చించానని రఘురాజు చెప్పారు. కరోనా కేసుల్లో దేశంలోనే మూడో స్థానానికి ఏపీ చేరుకుందని... రానున్న రోజుల్లో అగ్రస్థానానికి చేరుకుంటుందని తెలిపారు. యాంటీ బాడీ టెస్టులు ఆలస్యమవుతున్నాయని... టెస్ట్ ఫలితాలు ఏడు రోజుల తర్వాత వస్తున్నాయని... ఈ లోపల వైరస్ విస్తరిస్తోందని చెప్పారు.
ఎంపీలు, అధికారులతో ముఖ్యమంత్రి వెబ్ సెమినార్ సమావేశం చేయాలని... ప్రతి రోజు మూడు జిల్లాల వారితో మాట్లాడాలని రఘురాజు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అతి పెద్ద సమస్య కరోనానే అని చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారని... సాక్షాత్తు ఎంపీలు కూడా కరోనా బారిన పడ్డారని అన్నారు. రాష్ట్రంలో ఆయుర్వేదం చదివిన 8 వేల మంది డాక్టర్లు ఉన్నారని... వారి సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. కరోనాతో సహజీవనం చేయాలనే వ్యాఖ్యలను పక్కన పెట్టి, దాన్ని అరికట్టడానికి యత్నించాలని అన్నారు.