Chandrababu: కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసింది.. గుంటూరు జీజీహెచ్లో మృతదేహాలు అలాగే ఉన్నాయి: చంద్రబాబు
- ప్రొటోకాల్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలి
- ప.గో జిల్లాలో రోగిని చెత్త వాహనంలో తరలించారు
- ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి
- నిర్లక్ష్యం వద్దు
కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. గుంటూరు జీజీహెచ్లో మృతదేహాలు ఉండిపోవడం బాధాకరమని, ప్రొటోకాల్ ప్రకారం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా రోగిని చెత్త తరలించే వాహనంలో తరలించడం దారుణమని ఆయన చెప్పారు.
'ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా కరోనా వేళ ప్రజలు అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతోంది. అలాగే కొన్ని సూచనలు చేస్తోంది. ప్రభుత్వం వీటిపై రాజకీయాలకు అతీతంగా స్పందించి చర్యలు తీసుకోవాలి' అని చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.
'కరోనాను మొదటి నుంచీ ప్రభుత్వం తేలికగా తీసుకుంది. తీరా తీవ్రత పెరిగాక చేతులెత్తేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలి. అధైర్య పడాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం వద్దు' అని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని తెలిపారు. మద్యపానం వంటి చెడు అలవాట్లను మానేయాలని చెప్పారు.