Raghurama Krishna Raju: పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా నిర్వహించాలి: రఘురామకృష్ణరాజు
- సీఎం జగన్ కు లేఖ రాసిన నరసాపురం ఎంపీ
- తెలంగాణ సర్కారు నిధులు కూడా కేటాయించిందని వెల్లడి
- ఏపీలోనూ కమిటీ ఏర్పాటు చేయాలని వినతి
దివంగత మాజీ ప్రధాని, తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహనీయుల్లో ఒకరైన పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా నిర్వహించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు. జాతి చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు నేతల్లో ఒకరిగా పీవీ నరసింహారావుకు ఎనలేని గుర్తింపు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని తెలిపారు.
"పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడు మాత్రమే కాదు, ఆయనో విద్యావేత్త, రచయిత, కళాభిరుచి ఉన్న వ్యక్తి, సంస్కృతి పట్ల గౌరవం ఉన్నవాడు. ప్రధానమంత్రిగా దేశం నూతన ఆర్థిక వ్యవస్థకు బీజాలు వేసింది ఆయనే. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇవాళ మనం చూస్తున్న, అనుభవిస్తున్న ప్రతి అంశంలోనూ ఆయన ముద్ర ఉంది. దక్షిణాది నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా తెలుగు రాష్ట్రాలకు ఆయనతో దృఢ అనుబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి పీవీని గర్వకారణంగా భావిస్తుంది.
ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగో ముఖ్యమంత్రి. అంతేకాదు, ఎంపీగా బరిలో దిగేందుకు తెలుగు గడ్డపై ఉన్న నంద్యాల ప్రాంతాన్నే ఎంచుకున్నారు. 2004లో పీవీ మరణించాక ఆయనకు అంత్యక్రియలు నిర్వహించిన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ప్రాంతాన్ని మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పీవీ ఘాట్ గా నామకరణం చేశారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం పీవీ శతజయంతి వేడుకల కోసం రూ.10 కోట్లు కేటాయించింది. వేడుకల కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నేనిప్పుడు మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే... పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీలో కూడా నిర్వహించేందుకు మీ తదుపరి క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోండి. అంతేకాదు, ఆ మహనీయుడికి మరణానంతరం భారతరత్న ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపుతారని ఆశిస్తున్నాను. పీవీ శతజయంతి ఉత్సవాల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ గానీ, శతజయంతి వేడుకల కమిటీని గానీ ఏర్పాటు చేసి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తారని భావిస్తున్నాను.
సర్, మనం ఈ విధంగా పీవీ శతజయంతి వేడుకలు నిర్వహిస్తే అది కచ్చితంగా మన పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో లాభిస్తుంది. తెలుగు ప్రజల్లో మన పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి" అంటూ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.