WHO: 5.2 సంవత్సరాలు తగ్గిపోయిన భారతీయుల ఆయుర్దాయం!
- గణనీయంగా పెరిగిపోయిన వాయు కాలుష్యం
- ఘనపు మీటర్ లో 63 మైక్రాన్ల కాలుష్యాలు
- వెల్లడించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
భారతీయుల సగటు ఆయుర్దాయం 5.2 సంవత్సరాలు తగ్గిపోయింది. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఇండియాలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగిపోయిన కారణంగానే ఆయుర్దాయం తగ్గిందని, ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించగలిగితే ప్రజల ఆయుర్దాయాన్ని కనీసం 9.4 సంవత్సరాల వరకూ పెంచవచ్చని సూచించింది. కాలుష్య కారకమైన పీఎం 2.5 రేణువులు ఘనపు మీటర్ లో 10 మైక్రాన్లకు, పీఎం 10 రేణువులు ఘనపు మీటర్ లో 20 మైక్రాన్లకు మించరాదని, కానీ ఇండియాలో సగటున ఇవి 63 మైక్రాన్ల వరకూ ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
ఇండియాలోని కాలుష్య కారకాలపై చికాగో కేంద్రంగా నడుస్తున్న ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ విశ్లేషణ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను అనుసరించి, ఇండియాలో కాలుష్యాన్ని తగ్గించగలిగితే ఆయుర్దాయాన్ని పెంచవచ్చని గుర్తించారు. 1998తో పోలిస్తే సగటు పరమాణు కాలుష్యం 42 శాతం మేరకు పెరిగిందని, దీంతో జీవితకాలం 1.8 సంవత్సరాలు తగ్గిందని ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది.
ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు, ప్రపంచంలో ఎన్నడూ లేనంత కాలుష్యంలో జీవిస్తున్నారని, ముఖ్యంగా ఉత్తర భారతావనిలో 24.8 కోట్ల మంది ఎనిమిది సంవత్సరాలకన్నా అధిక ఆయుర్దాయాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారని, లక్నోలో ప్రజలు 10.3 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోనున్నారని వెల్లడించింది. ఇక ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే బీహార్ ప్రజల్లో 7 సంవత్సరాలు, హర్యానా వాసులకు 8 సంవత్సరాల వరకూ ఆయుస్సును పెంచవచ్చని పేర్కొంది.