China: మా యాప్స్ పై వెనక్కు తగ్గండి: భారత్ కు చైనా హెచ్చరిక!
- పలు చైనా యాప్స్ పై ఇప్పటికే నిషేధం
- మరో 200 యాప్స్ పై నిఘా
- దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయి
- ఘాటుగా స్పందించిన చైనా
తమ దేశపు యాప్స్ ను నిషేధించడం, ఇండియా చేసిన ఉద్దేశపూర్వక తప్పని, దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలని చైనా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు గట్టి నిరసనను వ్యక్తం చేసిన చైనా, ఇండియా స్పందన సంతృప్తికరంగా లేకుంటే, తమ వ్యాపార సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జీ రోంగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
వుయ్ చాట్ నిషేదంపై భారత ప్రభుత్వంతో తాను మాట్లాడినట్టు పేర్కొన్న ఆయన, దీంతో పాటు చైనా నేపథ్యం ఉన్న 59 యాప్స్ ను బ్యాన్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇండియా నిర్ణయంతో చైనా కంపెనీల చట్టబద్ధమైన హక్కులకు తీవ్ర విఘాతం కలిగిందని వెల్లడించిన ఆయన, ఈ చర్యలతో దౌత్య పరమైన సంబంధాలూ దెబ్బతింటున్నాయన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడి ప్రభుత్వంపై ఉందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల 59 చైనా యాప్ లను నిషేధించిన భారత్, తాజాగా, మరో 47 యాప్స్ ను బ్యాన్ చేయడంతో పాటు మరో 200కు పైగా యాప్స్ పై దృష్టిని సారించి, అవి పనిచేస్తున్న తీరు, వాటి నుంచి చైనాకు ఏ విధంగా సమాచారం వెళుతుందన్న విషయంపై ప్రత్యేకంగా విచారిస్తోంది. తాజాగా నిషేధం విధించిన యాప్స్ పై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.