ys veveka: వైఎస్ వివేకా హత్య కేసు: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని విచారిస్తోన్న సీబీఐ అధికారులు
- కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు దేవిరెడ్డి
- 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్ రెడ్డి పేరు
- హత్య జరిగిన రోజు ఘటనా స్థలిలో దేవిరెడ్డి
- సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరించారని ఆరోపణలు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా సీబీఐ అధికారులు పులివెందులలో ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఈ రోజు పులివెందులకు చెందిన వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు.
వివేకా కుమార్తె సునీత ఈ కేసులో హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్ రెడ్డి పేరు కూడా ఉంది. హత్య జరిగిన రోజు ఘటనా స్థలిలో వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు ఆయన కూడా ఉన్నారు. ఆయన సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గతంలో శివశంకర్ రెడ్డిని 5 రోజులపాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థ అధికారులు విచారించారు. సిట్ అధికారులు ఈ కేసును ఛేదించలేకపోయారు. మరోవైపు శంకర్ రెడ్డిపై వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగిన తర్వాత కొందరు అనుమానితులతో ఆయన మాట్లాడినట్లు సునీత హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.