Ayodhya Ram Mandir: రావాలని ఉన్నా.. దయచేసి రావద్దు: శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు
- అందరూ రావాలనే మేం కూడా కోరుకుంటున్నాం
- ప్రస్తుత కరోనా కాలంలో అది సాధ్యం కాదు
- ఆ రోజు సాయంత్రం ఎవరికి వారు తమ ఇళ్లలో దీపాలు వెలిగించండి
అయోధ్యలో ఆగస్టు 5న జరగనున్న రామాలయ నిర్మాణ భూమి పూజకు దయచేసి ఎవరూ రావాలని అనుకోవద్దని, ఆ రోజు సాయంత్రం అందరూ ఇళ్లలోనే ఉండి దీపాలు వెలిగించాలని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు దేశ ప్రజలను కోరింది.
రామాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడికి రావాలని ఎవరూ అనుకోవద్దని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. రామాలయ ఉద్యమం ప్రారంభించిన 1984 నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ వెనక ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
భూమి పూజ జరిగే రోజున అయోధ్యలో ఉండాలని అందరూ కోరుకుంటారని, ట్రస్టు కూడా అలాగే ఆలోచిస్తోందని అయితే, ప్రస్తుత కరోనా కాలంలో అది సాధ్యం కాదని చంపత్ రాయ్ అన్నారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం పరిమిత సంఖ్యలోనే ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ప్రత్యక్ష కార్యక్రమాన్ని తిలకించాలని, ఆ రోజు సాయంత్రం ఎవరికి వారు తమ ఇళ్లలోనే ఉంటూ దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.