China: చైనాను మళ్లీ వణికిస్తున్న కరోనా.. మూడు నెలల తర్వాత ఒకే రోజు వంద కేసులు
- ఏప్రిల్ 13 తర్వాత వందకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి
- 89 కేసులు ఒక్క షిన్జింగ్లోనే..
- కరోనాతో చైనాలో ఇప్పటి వరకు 4,634 మంది మృతి
చైనాలో దాదాపు తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మూడు నెలల తర్వాత తొలిసారి ఆ దేశంలో ఒకే రోజు వందకుపైగా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం మూడు నెలల వ్యవధిలో ఇదే తొలిసారి. ఏప్రిల్ 13న 108 కేసులు వెలుగు చూడగా ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 89 ఒక్క షిన్జియాంగ్ ప్రాంతంలోనే నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న చైనా.. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తోంది. రాజధాని బీజింగ్‌లో ఇప్పటి వరకు దాదాపు 10 లక్షలు, డాలియన్, ఝావోలైన్ నగరాల్లో దాదాపు 30 లక్షల పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కాగా, చైనాలో ఇప్పటి వరకు 84,060 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు.