Donald Trump: వాయు కాలుష్యాన్ని పట్టించుకోవడం లేదు.. ఇండియా, రష్యా, చైనాలపై ట్రంప్ విసుర్లు
- కాలుష్యాన్ని నియంత్రించడానికి మేమెంతో చేశాం
- నేను ప్రెసిడెంట్ అయ్యాక అమెరికాను నెంబర్ వన్ చేశాను
- డెమోక్రాట్లు దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు
వాయు కాలుష్యాన్ని ఇండియా, రష్యా, చైనాలు కంట్రోల్ చేయడం లేదని... వారి దేశాల్లో గాలి నాణ్యతను పట్టించుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి తాము ఎంతో చేస్తున్నామని చెప్పారు. ఆ మూడు దేశాలు వాతావరణ కాలుష్యాన్ని పట్టించుకోబోవని అన్నారు.
తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తమ దేశాన్ని నెంబర్ వన్ స్థానంలోనే నిలబెడతానని ట్రంప్ చెప్పారు. కొన్నేళ్లుగా ఇతర దేశాలను తొలి స్థానంలో నిలబెట్టామని... ఇప్పుడు అమెరిగా ఫస్ట్ ప్లేస్ లో ఉందని అన్నారు. డెమోక్రాట్లు అమెరికాను నాశనం చేయాలనుకుంటున్నారని చెప్పారు. అమెరికన్ల జీవన విధానంపై డెమోక్రాట్లకు గౌరవం లేదని విమర్శించారు. ప్రపంచ చరిత్రలో అమెరికన్ల జీవన విధానం కంటే మెరుగైనది లేదని చెప్పారు. మన దేశ ప్రజలకు మాతృభూమి అన్నా, జాతీయగీతమన్నా, జాతీయ జెండా అన్నా చాలా ఇష్టమని అన్నారు.
గత ప్రభుత్వంలో అమెరికా ఎనర్జీ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని... యూఎస్ అధ్యక్షుడిగా తాను బాధ్యతలను తీసుకున్న తర్వాత ఆ ప్రయత్నాలను అంతం చేశానని ట్రంప్ చెప్పారు. ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం అమెరికాకు ఆర్థిక భారమని... ఒప్పందం నుంచి బయటకు రావడం వల్ల బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా అయ్యాయని తెలిపారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికా ఎనర్జీ ఎగుమతిదారుగా ఎదిగిందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, సహజవాయువు ఉత్తత్తిదారుగా అమెరికా అవతరించిందని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో విపక్ష డిమోక్రాట్లపై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి అధికార పగ్గాలను చేపట్టేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు.