BJP: మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పష్టీకరణ
- అమరావతి విషయంలో చంద్రబాబు హామీలపై కేంద్రం జోక్యం చేసుకోలేదు.. ఇప్పుడూ అంతే!
- వైసీపీ, టీడీపీల్లా మాది కుటుంబ పార్టీ కాదు
- జనసేనతో కలిసి అధికారం దిశగా ముందుకు సాగుతాం
ఏపీ రాజధాని అమరావతి విషయంలో నాడు చంద్రబాబు హామీలపై కేంద్రం జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కుండబద్దలుగొట్టారు. అయితే, ఏపీ బీజేపీ మాత్రం అమరావతినే రాజధానిగా కోరుకుంటోందన్నారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజును పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు సన్మానించారు. ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడారు. టీడీపీ, బీజేపీల్లా తమది కుటుంబ పార్టీ కాదని, బీజేపీ సకల జనుల పార్టీ అని అన్నారు.
వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీ తమకు దగ్గరేనని ప్రచారం చేసుకుంటున్నాయన్నారు. అయితే ఆ రెండు పార్టీలను తాము సమానంగానే చూస్తామన్నారు. జనసేనతో కలిసి అధికారం సాధించే దిశగా ముందుకు సాగుతామన్నారు. ఇళ్ల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని వీర్రాజు ఆరోపించారు. ఇదిలావుంచితే, గతంలో ఆ పార్టీ నేత సుజనా చౌదరి మాట్లాడుతూ.. మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు ఈ విషయంపై వీర్రాజు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.