Nimmagadda Ramesh Kumar: మన వ్యవస్థలు ఇంతే.. పెద్దపెద్ద నేతలనే లొంగదీశాయి: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి
- నిమ్మగడ్డ నేర్పిన నీతి ఏమిటి?
- మెల్లమెల్లగా మబ్బుల్లోంచి నేలపైకి దిగి వస్తున్నారు
- నిమ్మగడ్డ నియామకంపై స్పందిస్తూ ట్వీట్ చేసిన బీజేపీ నేత
ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి జీవో జారీ చేయడంపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు. నిమ్మగడ్డ నేర్పిన నీతి ఏంటి? అని ప్రశ్నిస్తూనే మన వ్యవస్థలు పెద్దపెద్ద నేతలనే లొంగదీశాయని, మనమెంత? అని అన్నారు. నిమ్మగడ్డ పోస్టును పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి వచ్చిందని, మెల్లమెల్లగా మబ్బుల్లోంచి నేల మీదకు దిగి వస్తున్నారని అన్నారు. రాక తప్పదని, ఇదీ అదేనంటూ ట్వీట్ చేశారు. దీనికి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను జత చేశారు.
కాగా, ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ గత అర్ధరాత్రి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ కాగా, నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు.