Raghu Ramakrishna Raju: జగన్ గారూ.. భయంతో మనం నిర్ణయాలు తీసుకున్నట్టు ఉండకూడదు: రఘురామకృష్ణరాజు
- ఎస్ఈసీగా నిమ్మగడ్డ ప్రసాద్ ను నియమించడం శుభపరిణామం
- ఆలస్యమయినా మంచి నిర్ణయం తీసుకున్నారు
- ఎవరికో శిక్ష పడుతుందని భయంతో నిర్ణయాలు తీసుకోకూడదు
మన దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి అనుసంధానమై ఉంటాయని.. ఒక వ్యవస్థ గాడి తప్పినా చాలా సమస్యలు తలెత్తుతాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విషయంలో జరిగిన తప్పిదాలతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో చూశామని చెప్పారు. కోర్టుల కోసం ఎంతో ప్రజాధనం వృథా అయిందని అన్నారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డను మళ్లీ నియమించడం ఆలస్యమైనా... ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
అయితే, తెల్లారితే ఈ అంశంతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులకు జైలుశిక్ష పడుతుందనే కారణంతో... అర్ధరాత్రి పూట నిర్ణయాలు తీసుకోవడం కాకుండా.... సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని జగన్ కు రఘురాజు సూచించారు. భయంతో మనం నిర్ణయాలు తీసుకున్నట్టు ఉండకూడదని చెప్పారు. ఇకపై ఇలా జరగకుండా మనం వ్యవహరించాలని అన్నారు. న్యాయ వ్యవస్థను గౌరవించాలని.. ఎవరికో శిక్ష పడుతుందనే భయంతో నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పారు.