Chandrababu: రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.. ప్రజలారా ఆలోచించండి: చంద్రబాబు ఫైర్
- మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తే అమరావతి పూర్తయ్యేది
- రకరకాల అపవాదులు వేసి అమరావతిని పక్కదారి పట్టించారు
- బిల్లు సెలెక్ట్ కమిటీ వద్ద ఉందని హైకోర్టుకు కూడా చెప్పారు
ప్రపంచ చరిత్రలో ఎక్కడా మూడు రాజధానులు లేవని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని... ఈ విషయంపై ప్రజలంతా ఆలోచించాలని అన్నారు.
అమరావతి కోసం డబ్బులు పెట్టి భూములు కొనలేదని... ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించామని చెప్పారు. మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అమరావతి పూర్తయ్యేదని అన్నారు. అమరావతి నిర్మాణానికి రూ. లక్ష కోట్లు ఖర్చవుతుందని, వరదలు, భూకంపం ముప్పు ఉందని, ఇలా రకరకాల అపవాదులు వేసి పక్కదారి పట్టించారని మండిపడ్డారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు.
శాసనమండలి స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ అని... మూడు రాజధానుల బిల్లును మండలి ఆమోదించలేదని చంద్రబాబు చెప్పారు. బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉందని హైకోర్టుకు కూడా చెప్పారని... కానీ, ఇలా ఆమోదించుకోవడం దుర్మార్గమని విమర్శించారు.