Botsa Satyanarayana: విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి జగన్ త్వరలో శంకుస్థాపన చేస్తారు: బొత్స
- వికేంద్రీకరణ బిల్లుపై బొత్స స్పందన
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి అద్భుత అవకాశమన్న బొత్స
- జగన్ నిర్ణయానికి తాము సహకరిస్తామని వెల్లడి
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీకి మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బొత్స మాట్లాడుతూ, సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి తామంతా సహకరిస్తామని చెప్పారు.
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని, అమరావతి ప్రాంతంతో పాటుగా విశాఖ కూడా దీటుగా ఎదుగుతుందని అన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖలో సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. అమరావతిలో భూమి కోసం భారీగా ఖర్చుపెడితే, విశాఖలో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ జగన్ నాయకత్వాన్నే బలపరుస్తున్నారని బొత్స పేర్కొన్నారు. పార్టీలో తీసుకున్న నిర్ణయాలకు తామందరం కట్టుబడి ఉంటామని, వ్యక్తిగత అభిప్రాయాలకు ఇక్కడ తావులేదని స్పష్టం చేశారు.