Telangana: బహిరంగ ప్రదేశాల్లో ధరించని మాస్కులు.. తెలంగాణలో 35 వేల మందిపై కేసులు

telangana police registered 35 thousand cases for not wearing masks

  • పిల్‌కు సమాధానంగా హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం
  • సామాజిక దూరం పాటించనందుకు 1,211 కేసులు
  • అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరైనందుకు 6 కేసులు నమోదు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కొవిడ్ నిబంధనలు గాలికి వదిలేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని, సామాజిక దూరం పాటించని, పెద్ద సంఖ్యలో శుభకార్యాలు, అంత్యక్రియలకు హాజరైన వారిపై కేసులు నమోదు చేస్తోంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సమాధానంగా వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా నివేదిక సమర్పించారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనందుకు 35,308 కేసులు నమోదు చేశామని,  సామాజిక దూరం పాటించనందుకు 1,211 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో సమావేశమైనందుకు 82 కేసులు నమోదు చేసినట్టు అందులో పేర్కొన్నారు. అలాగే, వివాహానికి 50 మంది, అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ హాజరుకాకూడదన్న నిబంధనను ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో వాటికి హాజరైనందుకు 24 కేసులు నమోదు చేసి 101 మందిని, నిబంధనలు ఉల్లంఘించి అంత్యక్రియలకు హాజరైనందుకు 6 కేసులు నమోదు చేసి 27 మందిని అరెస్ట్ చేసినట్టు ఆ నివేదికలో అలీ ముర్తజా వివరించారు.  

అలాగే మార్చి 14 నుంచే పాఠశాలలు, బార్లు, క్లబ్బులు మూసివేశామని, మార్చి 23న రాష్ట్రంలో 33 కేసులు నమోదు కాగా, జూన్ 29 నాటికి 15,394 కేసులు నమోదైనట్టు తెలిపారు. జులై 25 నాటికి  2,64,852 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 27.3 శాతం నుంచి 10.18 శాతానికి తగ్గిందని, ప్రతి 10 లక్షల మంది జనాభాకు 140 పరీక్షలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినప్పటికీ అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే పరీక్షలు చేస్తున్నట్టు వివరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 57 ప్రభుత్వ, 54 ప్రైవేటు ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న కేటగిరీ పడకల సమాచారాన్ని మీడియా బులెటిన్‌లో పేర్కొంటున్నట్టు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News