Somireddy Chandra Mohan Reddy: బీజేపీ నేతల తీరు బాధాకరం.. 6 లక్షల ఇళ్లు శిథిలాలుగా మారిపోతున్నాయి: సోమిరెడ్డి
- అమరావతికి జగన్ అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికారు
- అమరావతి ఢిల్లీలాంటి నగరం కావాలని మోదీ చెప్పారు
- నిమ్మగడ్డ విషయంలో ఏం జరిగిందో అందరం చూశాం
రాజధానిని మార్చడం ముమ్మాటికే తప్పేనని... రాష్ట్ర ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఒకవేళ రాజధానిని మార్చాలనుకుంటే ప్రజలను రెఫరెండం కోరాలని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఒక వీడియో ద్వారా స్పందించారు.
అమరావతిని బీడు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ అనుకోవడం దుర్మార్గమని చెప్పారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత... అమరావతే రాజధాని అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ సంపూర్ణ అంగీకారాన్ని తెలిపారని, బీజేపీ సభ్యులు మద్దతిచ్చారని చెప్పారు. అమరావతి కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని అన్నారు.
శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ప్రధాని మోదీ... అమరావతి మరో ఢిల్లీలాంటి నగరం కావాలని ఆకాంక్షించారని చెప్పారు. వీటన్నింటిని నమ్మి 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతులది తప్పా? గొప్ప కేపిటల్ అవుతుందని భావించి కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిన కంపెనీలది తప్పా? అని ప్రశ్నించారు. రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసిన అమరావతిని మార్చేస్తామని చెప్పడం దారుణమని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 6 లక్షల ఇళ్లను కడితే... వాటిని కూడా వైసీపీ ప్రభుత్వం బీడు పెట్టేసిందని సోమిరెడ్డి మండిపడ్డారు. ఆ ఇళ్లన్నీ శిథిలాలుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు అమరావతికి తామ మద్దతు అంటారని... మరోవైపు మూడు రాజధానులతో సంబంధం లేదంటారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకుల తీరు చాలా బాధను కలిగిస్తోందని అన్నారు. ప్రధాని కూడా భరోసా ఇచ్చినందుకే రైతుల్లో నమ్మకం కలిగిందని... ఇప్పుడు వారంతా ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశమంతా గమనిస్తోందని చెప్పారు. నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారం ఏమైందో చూశామని అన్నారు. తమకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు చెప్పినా మొండిగా ముందుకెళ్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని సవాల్ విసిరారు.