Tresa Soriano: కరోనా ప్రభావంతో విమానాల్లేక భారత్ లో నిలిచిపోయిన స్పెయిన్ యువతికి కన్నడ ఆతిథ్యం!
- బాయ్ ఫ్రెండ్ తో భారత్ వచ్చిన స్పెయిన్ యువతి
- లాక్ డౌన్ తో తిరిగిన స్పెయిన్ వెళ్లిపోయిన బాయ్ ఫ్రెండ్
- ఆతిథ్యమిచ్చిన సహోద్యోగి
భారత్ లో విహారయాత్రకు బాయ్ ఫ్రెండ్ తో సహా వచ్చిన స్పెయిన్ యువతి ఇప్పుడు కర్ణాటకలో అద్భుతమైన ఆతిథ్యం అందుకుంటోంది. స్పెయిన్ లోని వాలెన్సియా నగరానికి చెందిన 34 ఏళ్ల ట్రెసా సొరియానో ఓ ఇండస్ట్రియల్ డిజైనర్ గా పనిచేస్తోంది. అయితే భారత్ గురించి ఆమె సోదరుడు కార్లోస్, కొలీగ్ కృష్ణ పూజారి చెప్పిన విషయాలు ఆమెలో కొత్త ఆలోచనలకు నాంది పలికాయి. ఎలాగైనా భారత్ ను సందర్శించాలనుకుని నిర్ణయించుకుంది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి మార్చిలో భారత్ తో పాటు శ్రీలంకలోనూ పర్యటించాలని షెడ్యూల్ వేసుకుంది. కానీ, కరోనా ప్రభావంతో వారి ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి.
ట్రెసా, ఆమె బాయ్ ఫ్రెండ్ వేర్వేరుగా భారత్ చేరుకున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్ కనీసం ముంబయి ఎయిర్ పోర్టు నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో తిరిగి స్పెయిన్ వెళ్లిపోయాడు. దాంతో ట్రెసా భారత్ లో చిక్కుకుపోయింది. ఈ పరిస్థితుల్లో ఆమె సహోద్యోగి కృష్ణ పూజారి ఆమెకు తమ ఇంట్లో ఆతిథ్యమిచ్చాడు. కృష్ణ పూజారి స్వస్థలం కర్ణాటకలోని హీరాంజల్. హీరాంజల్ కర్ణాటక సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఓ గ్రామీణ ప్రాంతం. అక్కడి సంస్కృతి స్పెయిన్ యువతి ట్రెసాను విపరీతంగా ఆకర్షించింది. కృష్ణ పూజారి తల్లి చిక్కమ్మ సాయంతో స్థానికంగా మాట్లాడే తుళు భాషలో కొన్ని వాక్యాలు మాట్లాడడం నేర్చుకుంది.
భారత్ లో ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని, ఇప్పుడు నాకు భారత్ లోనూ ఓ కుటుంబం ఉందని మురిసిపోతూ చెబుతోంది. ఇక్కడి ప్రజలు నన్ను తమ కుమార్తెలా భావించి స్వాగతించారని ట్రెసా హర్షం వ్యక్తం చేసింది. "ప్రస్తుతం నేను వేరుశనగ సాగులోనూ పాలుపంచుకుంటున్నాను. ఆవుల నుంచి పాలు పితుకుతున్నాను. వరినాట్లు కూడా వేస్తున్నాను. నదిలో చేపలు పడుతున్నాను. సమీపంలోని అడవి నుంచి ఆకులు సేకరిస్తున్నాను. అందమైన రంగవల్లులు తీర్చిదిద్దడంతోపాటు, కొబ్బరిపుల్లలతో చీపురు తయారుచేయడం కూడా నేర్చుకున్నాను" అంటూ హీరాంజల్ లో తన అనుభవాలను వివరించింది.
స్పెయిన్ అమ్మాయి ట్రెసాకు ఆతిథ్యమిచ్చిన కృష్ణ పూజారి మాట్లాడుతూ, కష్టకాలంలో ఆమెకు ఆశ్రయం ఇవ్వగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నామని తెలిపాడు. స్థానిక ప్రజలతో ఆమె కలిసిపోతున్న తీరు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయలను ఆమెను ఆకళింపు చేసుకుంటున్న విధానం తమను ఆకట్టుకుందని వివరించాడు.