Anil Kumar Yadav: చంద్రబాబు రాజీనామా చేయాలి.. పవన్ గురించి మాట్లాడటం కూడా వేస్టే: అనిల్ కుమార్ యాదవ్
- మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు
- బినామీలు నష్టపోతారని చంద్రబాబు బాధపడుతున్నారు
- పవన్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు
గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో... మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరోవైపు ఈ అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారని... చంద్రబాబుకు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలని, 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చంద్రబాబు ఇంత బాధ పడలేదని... ఇప్పుడు బినామీలు నష్టపోతారని బాధపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏపీలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ప్రతిపక్షాలు మానుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి ఒకే ప్రాంతంలో జరిగితే ప్రాంతీయ అసమానతలు వస్తాయని అనిల్ అన్నారు. మూడు రాజధానులపై జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలంతా హర్షిస్తున్నారని చెప్పారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతాయని... అంత డబ్బును ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ గురించి మాట్లాడటం అనవసరమని చెప్పారు. ఆయన ఎప్పుడు, ఏమి మాట్లాడతారో తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామాతో ఎలాంటి ప్రయోజనం లేదని... ఆయనను స్ఫూర్తిగా తీసుకుని టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని అన్నారు.