Ayodhya Ram Mandir: ఎస్పీజీ గుప్పెట్లో అయోధ్య.. మోదీ రేపటి షెడ్యూల్ ఇదే!
- అయోధ్యలో రేపే భూమిపూజ
- ఢిల్లీ నుంచి లక్నోకు.. అక్కడి నుంచి అయోధ్యకు మోదీ పయనం
- తొలుత హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించనున్న ప్రధాని
అయోధ్య రామ మందిరం నిర్మాణానికి రేపు భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడం కోసం కోట్లాది మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతుండగా... విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ హాజరవుతున్నారు. వేదికపై వీరిద్దరితో పాటు యూపీ గవర్నర్, సీఎం, అయోధ్య టెంపుల్ ట్రస్ట్ ఛైర్మన్ మాత్రమే ఆసీనులు కానున్నారు.
మరోవైపు ఉగ్రవాదులు దాడికి తెగబడే అవకాశాలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా వచ్చాయి. దీంతో, అయోధ్య మొత్తం ఎస్పీజీ భద్రతాబలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. అయోధ్య నగరంలోకి ప్రవేశించే రహదారులు, సరిహద్దులను మూసేశారు. స్థానికులు కూడా ఐడీ కార్డును దగ్గర పెట్టుకుని సంచరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బయటి నుంచి నగరంలోకి వచ్చే వారిపై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు.
ప్రధాని మోదీ షెడ్యూల్ విషయానికి వస్తే... రేపు ఉదయం ఒక ప్రత్యేక విమానం ద్వారా ఆయన ఢిల్లీ నుంచి లక్నోకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 125 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళతారు. తొలుత ఆయన అక్కడున్న హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. 10 నిమిషాల పాటు అక్కడ పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి రామ మందిరాన్ని నిర్మించే ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ బాల రాముడి (రామ్ లల్లా) విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు.
మరోవైపు భూమిపూజ నేపథ్యంలో మత పరమైన క్రతువులు నిన్ననే ప్రారంభమయ్యాయి. భూమిపూజ కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రత్యక్షప్రసారం చేయనుంది.