Chandrababu: అమరావతిని నాశనం చేస్తారని ముందే చెప్పాను.. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి: చంద్రబాబు
- రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని జగన్ చెప్పారు
- నీచ రాజకీయాలు చేస్తున్నారు
- రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని నాశనం చేస్తారని ముందే చెప్పానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఏం చెప్పారని... ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనప్పుడు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ అన్యాయం జరగబోతోందని అన్నారు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారని... ఇలాంటి వారికి బుద్ధి చెప్పే పరిస్థితి రావాలని అన్నారు. ప్రజా ప్రయోజనాలను గాలికొదిలేశారని విమర్శించారు. నీచ రాజకీయాలు చేస్తూ... మూడు ముక్కలాట ఆడుతున్నారని దుయ్యబట్టారు.
అమరావతిపై ఎన్ని రకాలుగా మాట్లాడతారని వైసీపీ నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. జగన్, వైసీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో వినిపించారు. ధైర్యముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అమరావతిని కాపాడాలని అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే... తమ పదవులను వదిలేస్తామని చెప్పారు. లేనిపక్షంలో ప్రజల భాగస్వామ్యంతో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
అమరావతికి అండగా ఉంటామని శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ చెప్పారని అన్నారు. అయోధ్య రామ మందిరం కోసం ఎందరో త్యాగాలు చేశారని తెలిపారు. రామమందిరానికి భూమిపూజ చేయడం సంతోషకరమని చెప్పారు. 200 నదుల పవిత్ర జలాలతో భూమిపూజ చేశారని... అమరావతిలో కూడా 30 నదుల పుణ్యజలాలతో భూమిపూజ చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.