Peddireddi Ramachandra Reddy: గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్తరిస్తోంది.. మాస్క్ ధరించని వారికి జరిమానా విధించండి: మంత్రి పెద్దిరెడ్డి
- ప్రజలంతా విధిగా మాస్కులు ధరించాలి
- మాస్కులు ధరించకపోతే రూ. 50 వరకు జరిమానా విధించండి
- పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలి
రాష్ట్రంలో కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోందని... ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. ప్రజలంతా విధిగా మాస్కులను ధరించాలని సూచించారు. ఈరోజు ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో పని చేసే ఉద్యోగులందరూ మాస్కులు ధరించాలని చెప్పారు.
అందరూ మాస్కులు ధరిస్తున్నారో, లేదో అనే విషయాన్ని గ్రామ వాలంటీర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మాస్క్ ధరించని వారికి గ్రామ పంచాయతీ స్థాయిని బట్టి రూ. 10 నుంచి రూ. 50 వరకు జరిమానా విధించవచ్చని చెప్పారు. ఇలా వసూలు చేసే జరిమానాను పారిశుద్ధ్య పనులకు ఉపయోగించేలా చూడాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించాలని... వాడవాడలా మైకుల ద్వారా అనౌన్స్ చేయాలని చెప్పారు. వీటి కోసం గ్రామంలోని గుడి, చర్చ్, మసీదుల మైకులను వాడుకోవాలని సూచించారు.