Botsa: లేస్తే 48 గంటల్లో మీ ముందుకొస్తానంటున్నావు... ఏం చేస్తావు?: చంద్రబాబుపై బొత్స ఫైర్
- టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం
- 48 గంటల డెడ్ లైన్లు విధిస్తున్న చంద్రబాబు
- చంద్రబాబు మాట మీద నిలబడే మనిషి కాదన్న బొత్స
రాజధాని అమరావతి విషయంలో పట్టుదలగా వున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డెడ్ లైన్ ల మీద డెడ్ లైన్ లు విధిస్తూ, రాజీనామాలు చేయాలంటూ వైసీపీ నేతలకు ఛాలెంజ్ లు విసురుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు కూడా వైసీపీ అధినాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. రాజీనామాలు చేయమంటే ముందుకు రావడంలేదని విమర్శిస్తున్నారు. దీనిపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను రాజీనామా చేయమంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఒక్కసారి మాటిస్తే ఆ మాటపై నిలబడే వ్యక్తి అని అన్నారు. 'వైఎస్సార్ స్ఫూర్తితో ప్రారంభమైన పార్టీ వైసీపీ. మాట తప్పే పార్టీ కాదు మాది. చంద్రబాబు ఏనాడైనా మాట మీద నిలబడ్డారా?' అని బొత్స ప్రశ్నించారు.
'డెడ్ లైన్ ఇచ్చాం స్పందించలేదంటారు... మరి మీరేం చేశారు? ఇవాళ సిగ్గు లేకుండా, తగుదునమ్మా అంటూ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. విశాఖపట్నాన్ని దోచుకున్నది మీరే. ఎంతసేపూ అమరావతిపై రాద్ధాంతం చేయడమేనా మీ పని? ఎవరు కాదన్నారు అమరావతిని? శాసన రాజధాని అని చెప్పాం కదా! చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు పాల్పడే వ్యక్తి. చంద్రబాబు గురించి దేశం మొత్తానికి తెలుసు. ఈయన ఇప్పుడో కొత్త పల్లవి మొదలుపెట్టాడు. లేస్తే 48 గంటల్లో మీ ముందుకు వస్తానంటున్నావు... ఏం చేస్తావు ముందుకొచ్చి? ఇప్పటివరకు ఏం చేశావు?
గతంలో చేసిన కామెంట్లను ముందు వెనుకలు కత్తిరించి అందంగా చూపించడంలో ఈయన దిట్ట... ఇలాంటి మ్యాజిక్కులకు ఈయనదే పేటెంట్. ఇప్పుడు తోకలు ముడిచామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజీనామాలపై తోక ముడవాల్సిన అవసరం మాకు అవసరంలేదు. రాజీనామాలపై తోక ముడిచిందెవరు?" అంటూ ప్రశ్నించారు.