Ayodhya Ram Mandir: అయోధ్య భూమిపూజ కార్యక్రమాన్ని ప్రసారం చేయకపోవడంపై టీటీడీ వివరణ!
- అయోధ్య భూమిపూజను ప్రత్యక్షప్రసారం చేసిన పలు ఛానళ్లు
- ఎస్వీబీసీలో ప్రసారం కాని కార్యక్రమం
- ఆ సమయంలో శ్రీవారి కల్యాణం జరుగుతోందన్న టీటీడీ
అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమిపూజను నిన్న యావత్ హిందూ సమాజం వీక్షించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు ఛానళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అయితే టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్ మాత్రం చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదు. ఈ వ్యవహారానికి సంబంధించి టీటీడీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ విశాఖ శారదాపీఠానికి వెళ్తే ప్రసారం చేశారని... అయోధ్య రాముడి కార్యక్రమాన్ని ఎందుకు వదిలేశారని బీజేపీ సూటిగా ప్రశ్నించింది. ఈ అంశంపై జగన్ తక్షణమే స్పందించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీటీడీ యాజమాన్యం స్పందించింది. ప్రతిరోజు తిరుమలలో స్వామివారికి నిత్యకల్యాణం ఉంటుందని చెప్పింది. అయోధ్య భూమిపూజ సమయంలో కల్యాణం జరుగుతోందని... ఆ సమయంలో శ్రీవారి కల్యాణాన్ని ప్రసారం చేశామని తెలిపింది. అయోధ్య భూమిపూజకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని వెల్లడించింది.