India: మహమ్మారి శరవేగం... ఇండియాలో 20 లక్షలు దాటేసిన కేసులు!
- 9 రోజుల వ్యవధిలో 5 లక్షల కేసులు
- రోజుకు సరాసరిన 50 వేలకు పైగా కొత్త పాజిటివ్ లు
- పెరుగుతున్న రికవరీల సంఖ్య
- వ్యాధి బారిన పడుతున్న ప్రముఖులు
ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ వేగం శరవేగంగా పెరిగింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్న సాయంత్రానికి 20 లక్షలను దాటేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,27,075 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల విషయంలో 28 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా, 50 లక్షలకు పైగా కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
జూలై 28 నాటికి ఇండియాలో కేసుల సంఖ్య 15 లక్షల మార్క్ ను తాకగా, ఆ తరువాత కేవలం 9 రోజుల వ్యవధిలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ఈ మహమ్మారి వేగాన్ని చెప్పకనే చెబుతోంది. సరాసరిన రోజుకు 50 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. కాగా, ఇదే సమయంలో రికవరీ సైతం వేగవంతమైంది. ఇప్పటివరకూ 13.28 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.
వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 40 వేల మార్క్ ను దాటింది. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కొత్త కేసులు వస్తున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 4.6 లక్షలకు పైగా కేసులుండటం గమనార్హం. తొలుత కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, ఆ తరువాత న్యూఢిల్లీలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో దేశ రాజధానిలో 1,299 కేసులు మాత్రమే వచ్చాయి. 15 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.
ఇక కరోనా వ్యాధి బారిన పడుతున్న వారిలో ప్రముఖుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గడచిన వారం రోజుల వ్యవధిలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులకు వ్యాధి సోకిన సంగతి తెలిసిందే.