JC Prabhakar Reddy: జైలులో కక్ష సాధింపు చర్యలు.. నాకు అన్నం పెట్టకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చారు: జేసీ ప్రభాకర్ రెడ్డి
- అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో ఆరోపణలు సరికాదు
- వాహనాల రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను ప్రశ్నించాలి
- ఏపీ ప్రభుత్వం అమరావతినే రాజధానిగా కొనసాగించాలి
- జగన్ను సన్మానించి రాజకీయాల నుంచి తప్పుకుంటా
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డికి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
జైలులో కూడా కక్ష సాధింపు తీరుతోనే వ్యవహరించారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తనకు ఆహారం కూడా ఇవ్వకుండా జైలు అధికారులపై ఒత్తిడి చేశారని ఆయన తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో తనపై ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. వాహనాలు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను ప్రశ్నించాలని ఆయన అన్నారు.
కాగా, ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ... ఏపీ ప్రభుత్వం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తాను ఏపీ సీఎం జగన్ను సన్మానించి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.