Kerala: కేరళలో కుండపోత వర్షాలు... వరద భయంతో హడలిపోతున్న జనం!
- భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు
- ఇడుక్కి, మళప్పురం జిల్లాల్లో రెడ్ అలెర్ట్
- మున్నార్ సమీపంలో విరిగిపడిన కొండచరియలు
- ఐదుగురి మృతి
రెండేళ్ల కిందట కేరళలో వచ్చిన వరదలు యావత్ ప్రపంచాన్ని స్పందింపచేశాయి. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు రాష్ట్రంలోని అన్ని డ్యాముల గేట్లు ఎత్తివేయగా, అన్ని జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఆ తీవ్రత లేకపోయినా, గత కొన్నిరోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు కేరళ అతలాకుతలమవుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో లోతట్టు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇడుక్కి, మళప్పురం జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసిన అధికారులు... కోజికోడ్, పాలక్కాడ్, ఎర్నాకుళం, కన్నూర్, త్రిశూర్ ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
కాగా, ఇడుక్కి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మున్నార్ సమీపంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించారు. అనేక ప్రాంతాల్లో వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు సైతం పనిచేయడంలేదు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో స్థానిక బలగాలకు తోడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.