Sajjala: వికేంద్రీకరణతో ముందుకుపోతామని జగన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పారు: సజ్జల
- రాజధాని అంశంపై సజ్జల ప్రెస్ మీట్
- చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- అసలు వాస్తవం ఏంటో చంద్రబాబుకు తెలుసన్న సజ్జల
- తాము ఏదీ రహస్యంగా చేయడంలేదని వెల్లడి
ఏపీ రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత కొన్నిరోజులుగా చంద్రబాబు రాజీనామా డిమాండ్లు చేస్తున్నారని, ప్రతి రోజూ మీడియాలో అదే కనిపిస్తోందని, ఒకరోజు పేపర్ చూడనివాళ్లు మరుసటి రోజు చూసినా అవే వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని అన్నారు. కొందరు ఆ వ్యాఖ్యలు నిజమే అని భావించే అవకాశం కూడా ఉందని, రాజధానుల అంశం మేనిఫెస్టోలో ప్రకటించలేదు కాబట్టి సీఎం జగన్ రిఫరెండంకు వెళ్లాలని వారు భావించినా ఆశ్చర్యపోనక్కర్లేదని సజ్జల పేర్కొన్నారు.
"అసలు వాస్తవం ఏంటో చంద్రబాబుకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు. 2014 ఎన్నికలకు ముందు తాను అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు తన మేనిఫెస్టోలో పెట్టలేదు. అమరావతి రాజధాని అంశంపై ఓటు వేయమని అడగలేదు. అందువల్ల, ఎన్నికల్లో ప్రజల తీర్పు మేరకు అమరావతిలో రాజధాని పెట్టలేదు. కేంద్రం అపాయింట్ చేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా వికేంద్రీకరణ గురించే మాట్లాడిన విషయం మీడియాకు గుర్తుండే ఉంటుంది. డ్రీమ్ సిటీ వంటి భారీ నగరం వద్దని కూడా చెప్పారు.
ప్రజల తీర్పూ లేదు, నిపుణుల కమిటీ సిఫారసు కూడా లేదు, మీకు మీరు రియల్ ఎస్టేట్ కోసం ఒకట్రెండు ప్రాంతాలు చూపించి, చివరికి హఠాత్తుగా అమరావతికి తీసుకువచ్చారు. మీరే ఏర్పాటు చేసుకున్న నారాయణ కమిటీ నిర్ణయంతో అమరావతిని రాజధాని అన్నారు. ఆ కమిటీలో అందరూ రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్లు, మీ అనుచరులే. కానీ ఆ రోజు అందరూ సహృదయంతో అర్థం చేసుకుని అంగీకరించారు.
నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేసుంటే ఈపాటికి గుంటూరు, విజయవాడ కలిసిపోయేవి. కానీ, ఎక్కడో దూరంగా పొలాల్లోకి తీసుకెళ్లి ఇదే రాజధాని అన్నారు. ఇక్కడే డ్రీమ్ సిటీ రాబోతోందన్నారు. ఇది ఆయన సొంతగా తీసుకున్న నిర్ణయమే. అందుకు ఎవరి సిఫారసు లేదు. కానీ ఈ నాలుగేళ్లు చంద్రబాబు ఏంచేశారో చెప్పాలి? మొత్తం ఎడారిలా వదిలేసి, రెండు చినుకులు పడితే కారే భవనాలు నిర్మించారు.
చంద్రబాబు అనవసరంగా అమరావతి ప్రజలను రెచ్చగొడుతున్నారు. వాస్తవాలను పక్కనబెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. మా నాయకుడు జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు... వికేంద్రీకరణతోనే ముందుకెళతామని ప్రకటించారు. గెలిచాక దీనిపై కమిటీలు వేసి, చట్టసభల్లోనూ చర్చలు జరిపాం. చట్టాలు కూడా తీసుకువచ్చాం. ఏదీ మేం రహస్యంగా చేయడంలేదు" అని సజ్జల స్పష్టం చేశారు.