Chandrababu: ఇకనైనా ప్రభుత్వం గిరిజనుల పట్ల బాధ్యతతో ఉంటుందని ఆశిస్తున్నాను:చంద్రబాబు
- నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
- గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- గిరిజనుల భద్రతనే ప్రశ్నార్థకం చేశారంటూ ఆవేదన
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అడవిబిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులని, ఏ కల్మషం లేనివారని కొనియాడారు. అయితే, ఇటీవలే కర్నూలులో భర్త కళ్లెదుటే ఆడబిడ్డపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఒక గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపడం వంటి ఘటనలు కలచివేశాయని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం గిరిజనుల పట్ల బాధ్యతతో ఉంటుందని ఆశిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
టీడీపీ హయాంలో గిరిజనుల సంక్షేమానికి రూ.14,210 కోట్లు ఖర్చు చేశామని, గిరి గోరుముద్దలు, రూ,120 కోట్లతో ఫుడ్ బాస్కెట్, విదేశీ విద్యకు రూ.378 కోట్లు, గిరిపుత్రికా కల్యాణ పథకం కింద ఆడబిడ్డ వివాహానికి రూ.50 వేల ఆర్థికసాయం, 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పింఛను 10 రెట్ల పెంపు వంటి వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చామని వెల్లడించారు.
కానీ, ప్రస్తుతం గిరిజనుల అభివృద్ధిని కాలరాయడం బాధాకరమని పేర్కొన్నారు. ఫుడ్ బాస్కెట్ రద్దు సహా అనేక గిరిజన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని, చివరికి గిరిజనుల భద్రతనే ప్రశ్నార్థకం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.