Voice Test: ముంబయిలో సరికొత్త టెక్నాలజీ.... వాయిస్ టెస్ట్ చేసి కరోనా ఉందో లేదో చెప్పేస్తారు!

BMC to use voice test technology to detect corona
  • ముంబయిలో కరోనా కల్లోలం
  • లక్ష దాటిన పాజిటివ్ కేసులు
  • సాంకేతికత సాయం తీసుకునేందుకు బీఎంసీ సిద్ధం
దేశంలో కరోనాతో అత్యధికంగా ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో ముంబయి మహానగరం ఒకటి. నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ముంబయిలో కరోనా సామాజిక సంక్రమణం దశకు చేరిందన్న అభిప్రాయాల నేపథ్యంలో, బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించుకుంది. కరోనా రోగులను గుర్తించేందుకు ఇప్పటివరకు యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాల్సి వస్తోంది.

ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఓ వ్యక్తి వాయిస్ టెస్ట్ చేసి అతడికి కరోనా ఉందో లేదో చెప్పేస్తారు. కరోనా అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తిని సెల్ ఫోన్ లో గానీ, కంప్యూటర్ ద్వారా గానీ మాట్లాడితే, ఆ మాటలను అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషిస్తారు. ఆ వ్యక్తి మాటల్లోని హెచ్చుతగ్గులను పరిశీలించి, అతడి రోగ లక్షణాలను అంచనా వేయడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో అభివృద్ధి చేశారు.

సాధారణంగా ఓ వ్యక్తి బలంగా మాట్లాడాలంటే ఊపిరితిత్తుల సామర్థ్యమే కీలకం. కరోనాతో ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు ఆ వ్యక్తి గొంతుక నుంచి వచ్చే బలహీన ధ్వనులను ఈ టెక్నాలజీ పసిగడుతుంది. ఈ వాయిస్ టెస్ట్ టెక్నాలజీని ఫ్రాన్స్, ఇటలీ వంటి కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికే వినియోగిస్తున్నాయి.
Voice Test
Corona Virus
Mumbai
BMC
Maharashtra

More Telugu News