Sri Ramulu: కరోనా బారినపడ్డ కర్ణాటక మంత్రి శ్రీరాములు...తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని వినతి!
- వైద్య ఆరోగ్య మంత్రిగా పర్యటనలు జరిపిన శ్రీరాములు
- ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స
- ట్విట్టర్ లో వెల్లడించిన మంత్రి
కర్ణాటక రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి బీ శ్రీరాములుకు కరోనా సోకింది. తనకు జలుబు, జ్వరంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ వచ్చిందని ఆయన స్వయంగా తెలిపారు. కరోనా కేసులు ప్రారంభమైన నాటి నుంచి తాను వివిధ జిల్లాల్లో పర్యటించానని, ఆసుపత్రులకు తిరుగుతూ, అక్కడ రోగులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించానని, ఈ క్రమంలోనే తనకు వైరస్ సోకి ఉంటుందని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో తగిన జాగ్రత్తలతో ఉండాలని శ్రీరాములు కోరారు. కాగా, ఇప్పటికే కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య తదితర నేతలు కరోనా బారిన పడ్డారన్న సంగతి తెలిసిందే. వీరంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 1.72 లక్షలను దాటగా, దాదాపు 90 వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 3 వేల మందికి పైగా మరణించారు.