Hyderabad: హైదరాబాద్ లో విజయవంతంగా ముగిసిన కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ ట్రయల్స్!
- 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చిన నిమ్స్
- బూస్టర్ డోస్ కూడా ఇచ్చామన్న అధికారులు
- రెండో దశ ప్రయోగాలకు ఏర్పాట్లు
హైదరాబాద్ లోని నిమ్స్ (నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 'కోవాగ్జిన్' తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు మొత్తం 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన నిమ్స్ బృందం, వారిలో 50 మందిని ఎంచుకుని వ్యాక్సిన్ టీకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి డోస్ ఇచ్చిన 14 రోజుల తరువాత అదే కోడ్ కు చెందిన బూస్టర్ డోస్ ను ఇచ్చామని, ఆ ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయిందని వైద్యాధికారులు తెలిపారు.
నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్ నేతృత్వంలోని క్లినికల్ ఫార్మకాలజీ విభాగం, పలువురు ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులతో పాటు రెస్పిరేటరీ, అనస్తీషియా, జనరల్ మెడిసిన్ విభాగాల డాక్టర్లు ఈ ట్రయల్స్ నిర్వహణలో పాలుపంచుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లందరూ ప్రస్తుతం తమతమ ఇళ్లలోనే ఉండగా, వారందరినీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇక 28 రోజుల తరువాత రెండవ మోతాదు టీకాను ఇచ్చేందుకు నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ విభాగం అధికారి డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్న వారి శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, వారికి రెండవ మోతాదు టీకా ఇచ్చే విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నామని అధికారులు తెలిపారు. కాగా, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా పలు చోట్ల పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాల నుంచి తొలి దశ ట్రయల్స్ విజయవంతం అయినట్టు తెలుస్తుండటంతో, రెండో దశను ప్రారంభించనున్నారు.