Telangana: తెలంగాణలో కరోనా కేసుల తాజా అప్డేట్.. బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం
- నిన్న రాష్ట్రవ్యాప్తంగా 1,897 కేసులు వెలుగులోకి
- 84,544కు పెరిగిన మొత్తం కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 479 కేసుల నమోదు
తెలంగాణలో కొవిడ్ మహమ్మారి చెలరేగుతూనే ఉంది. భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 22,972 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,897 కేసులు వెలుగు చూశాయి. ఇంకా 1221 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉన్నట్టు తాజాగా విడుదల చేసిన బులెటిన్లో ప్రభుత్వం పేర్కొంది.
తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 84,544కు పెరిగింది. అలాగే, నిన్న 9 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 654కు పెరిగింది. మహమ్మారి కోరల నుంచి నిన్న 1,920 మంది బయటపడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 61,294కు చేరుకోగా, ఇంకా 22,596 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో 479 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగు చూడగా, రంగారెడ్డి జిల్లాలో 162, సంగారెడ్డిలో 107, వరంగల్లో 87, పెద్దపల్లిలో 62 కేసులు బయటపడ్డాయి.