Hyderabad: హైదరాబాద్‌లో కరోనా భయంతో వేర్వేరు ఘటనలలో ముగ్గురి ఆత్మహత్య
- కరోనా సోకకున్నా భయంతో ఒకరు
- చుట్టుపక్కల వారు ఎలా చూస్తారోనన్న ఆదుర్దాతో మరొకరు
- టీవీల్లో వచ్చే వార్తలు చూసి మరొకరు ఆత్మహత్య
కరోనా భయంతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్‌నగర్‌కు చెందిన సుజాత (45)కు రెండు రోజుల క్రితం జ్వరం రాగా కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆసుపత్రిలో చూపించారు. అది మామూలు జ్వరమేనని తేల్చిన వైద్యులు మందులు ఇచ్చి పంపారు. అయితే, తనకు సోకింది కరోనాయేనని మనస్తాపం చెందిన సుజాత ఈ నెల 10న రాత్రి భర్త అనంత్‌రెడ్డి నైట్ డ్యూటీకి వెళ్లిన వెంటనే పడకగదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మరో ఘటనలో కరీంనగర్‌కు చెందిన వ్యక్తి (60) ఈ నెల 6న కరోనాతో మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చేరాడు. తాజాగా, కరోనా నుంచి కోలుకున్న అతడు మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ కావాల్సి ఉంది. అయితే, డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తే చుట్టుపక్కల వారు ఎలా చూస్తారో అన్న ఆందోళనకు గురయ్యాడు. దీనికి తోడు టీవీల్లో వచ్చే వార్తలు అతడిని మరింత ఆందోళనలోకి నెట్టేశాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పీపీఈ కిట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మూడో ఘటనలో జీడిమెట్లలో ఉంటున్న నిజామాబాద్ జిల్లా ఏర్గట్లకు చెందిన హేమలత (65) టీవీలో వచ్చే కరోనా వార్తలు చూసి ఆందోళనతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త ఏలేటి ఆనంద్‌రెడ్డితో కలిసి నివసిస్తున్న ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. టీవీలో రోజూ వచ్చే కరోనా వార్తలు చూసి మానసికంగా కుంగిపోయిన ఆమె ఆదివారం మధ్యాహ్నం భర్తకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
భార్య కనిపించకపోవడంతో రాత్రి 8 గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేస్తే.. తాను చనిపోవడానికి వెళ్తే పరిస్థితులు అనుకూలంగా లేవని పేర్కొంది. దీంతో ఆందోళన చెందిన ఆనంద్‌రెడ్డి ఎక్కడ ఉన్నావని ఆరా తీయగా పోచంపాడు కాల్వ వద్ద ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో నిన్న ఉదయం ఎస్సారెస్పీ కాకతీయ కాలవ వెంట గాలించగా కమమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ శివారులో ఆమె మృతదేహం కనిపించింది. మూడు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.