temple: బెంగళూరు ఘర్షణల్లో ఆందోళనకారులు హిందూ ఆలయాన్ని కూల్చకుండా అడ్డుకున్న ముస్లిం యువకులు.. వీడియో ఇదిగో!
- మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన
- డీజే హాళ్లి ప్రాంతంలో భయాందోళనలు
- విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు
- హిందూ ఆలయం ముందు ముస్లిం యువకుల మానవహారం
భారత దేశంలో కొనసాగే మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన ఇది. ఓ వైపు ఓ వర్గం వారు చేస్తోన్న భారీ హింసతో కర్ణాటకలోని బెంగళూరులోని డీజే హళ్లి ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు, ముస్లిం యువకులు మతసామరస్యాన్ని చాటారు.
ఆందోళనకారులు అక్కడి హిందూ ఆలయాన్ని కూల్చకుండా ఆ మందిరం చుట్టూ మానవహారంగా నిలబడి అడ్డుకున్నారు. అంతటి ఉద్రిక్తతల మధ్య కూడా ఆ ముస్లిం యువకులు భారతీయ భిన్నత్వంలోని ఏకత్వ విలువను చాటడం పట్ల సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. భారతీయతలోని గొప్పదనం ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా స్పందిస్తూ ఆ ముస్లిం యువకులను ప్రశంసించారు. ఒక కమ్యూనిటీలోని కొందరు చేసిన పని కారణంగా ఆ మొత్తం కమ్యూనిటీని నిందించడం సరికాదని అన్నారు. బెంగళూరు ఘర్షణలకు కారణమైన వారిని అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.